Sajjala visited MP Suresh: మాజీ ఎంపీ సురేష్ ను పరామర్శించిన సజ్జల..! 12 d ago
AP: మాజీ ఎంపీ నందిగాం సురేష్ అక్రమ కేసుల్లో అరెస్టై నాలుగు నెలలు అవుతోందని, ఆధారాలు లేకుండా సురేష్ పై కేసులు పెట్టారని వైఎస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం గుంటూరు జైలులో ఉన్న సురేష్ ను పరామర్శించిన తర్వాత సజ్జల మీడియాతో మాట్లాడుతూ...
నేడు టీడీపీ వ్యవహరించినట్లు మేము వ్యవహరించి ఉంటే ఈ కేసులు అప్పుడే తీసేసుకునే వాళ్ళమని అన్నారు. మా పాలనలో చట్టం తన పని తాను చేసుకుని వెళ్ళిందన్నారు. కోర్టుల్లో ఉన్న లొసుగులను ఉపయోగించి జైల్లో ఉంచుతున్నారని చెప్పారు. జైల్లో మాజీ ఎంపీకి కనీస సదుపాయాలు కల్పించడం లేదని అన్నారు. వాటర్ బాటిల్ కూడా అనుమతించడం లేదని మండిపడ్డారు. నేరుగా సీఎం కొడుకే ఫోన్ చేసి సురేష్ ను ఎలా ఉంచాలి? అనేది చెబుతున్నారని వెల్లడించారు. అన్ని మౌనంగానే భరిస్తున్నామన్నారు. వైఎస్ఆర్ సీపీ ని లేకుండా చేయాలని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన మహిళలను అరెస్ట్ చేస్తున్నారని తెలిపారు. గతంలో ముప్పై ఏళ్ళ క్రితం నక్సలైట్లను అరెస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టిన వారిని అరెస్ట్ చేస్తున్నారని చెప్పారు. వేధించడం అంటే ఎలా ఉండాలో మాకు నేర్పుతున్నారని వెల్లడించారు. ప్రజలు ఇచ్చిన అధికారం ప్రజల కోసమే ఉపయోగించాలన్నారు. కూటమి ప్రభుత్వం కక్ష తీర్చుకోవడంలో కొత్తకొత్త పద్దతులు ఉపయోగిస్తున్నారన్నారు. గుంట నక్కల్లా వ్యవహరించడం వైఎస్ఆర్ సీపీ కి తెలియదన్నారు. మీ కంటే బలంగా కొట్టగలిగే శక్తి ఉందని పేర్కొన్నారు. నాలుగేళ్ళలో మేము అధికారంలోకి వస్తే మా వాళ్ళు చెప్పినా కూడా వినే పరిస్థితి ఉండదని సజ్జల హెచ్చరించారు.